Home  »  Featured Articles  »  తెలుగువారి సంస్కృతిలో భాగమైపోయిన బాపు గీత, వ్రాత!

Updated : Dec 15, 2024

బాపు.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూన్తు, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. ఇక తన చిత్ర కళను చలనచిత్రాలు రూపొందించడం వైపు మళ్లించారు బాపు. బాపు సినిమాల శైలి వేరు. ఆయన సినిమాలు కూడా ఆయన వేసిన బొమ్మల్లాగే అందంగా ఉంటాయి. 


పాఠశాల రోజుల్లోనే ‘బాల’ అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు ‘అమ్మమాట వినకపోతే’ అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు... కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ ‘కోతికొమ్మచ్చి’ ‘బుడుగు’లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో ‘ముత్యాలముగ్గు’ సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

బాపు గీతకు గురువు
బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతి నిధి అయినట్టే, గోపులు బొమ్మ తమిళిత్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రులు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు. బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇంతగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసాగింది.ముందుగా చెప్పక పోతే వీరిద్దరిలో ఎవరు గీసిన బొమ్మొ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే!

1986-88 వరకూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు ముళ్ళపూడి వెంకట రమణలు పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమం లోనికి మార్చారు. విద్యారంగంలో ఒక వినూత్న ప్రయత్నంగా ప్రారంభించారు. బాపు వయోజన విద్య కోసం కూడా పాఠ్యాంశాలను సిద్ధపరచారు. బాలల దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో బుడుగు పాత్రను సృష్టించారు, తెలుగు సాహిత్యంలోనే ఒక మకుటాయమానంగా నిలిచిపోయింది.

1964లో బెంగులూరులో జరిగిన యునెస్కో పిల్లల పుస్తకాలపై నిర్వహించిన సెమినారుకి ప్రతినిధిగా పాల్గొన్నారు. అదే సంవత్సరం చెన్నైలో యునెస్కోనే నిర్వహించిన పుస్తక ముఖచిత్ర రచన, అంతర్‌ చిత్రాలను గీసే తర్ఫీదు నిచ్చే కార్యక్రమాన్ని బాపుకే అప్పగించడం జరిగింది.

1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1976 లో వెలువడిన ‘సీతాకల్యాణం’ సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది.

బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా (స్టోరీబోర్డు) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కించేవారు. ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవాడు. ఉదాహరణకి... రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం.

వ్యక్తిగత విషయాలకు వస్తే.. బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. 1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్‌ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. 2014 ఆగస్టు 31న చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనుమూసారు.

బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అందులో ముఖ్యమయినవి కొన్ని:

బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ బహుమతితో పాటు సినిమాటోగ్రాఫర్‌ ఇషాన్‌ అర్యాకి ఛాయగ్రాహకుడిగా బహుమతి.
1986 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక బహుమతి మదర్‌ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి స్వీకారం.
చెన్నై (తమిళనాడు) లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్‌ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి బహుమతి 1982 వ సంవత్సరంలో ఇవ్వబడిరది.
1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్‌ కళాప్రపూర్ణ బహూకరణ.
1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్‌ వారిచే శిరోమణి బహుమతి అమెరికాలో స్వీకరణ.
మిస్టర్‌ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ బహుమతి. (1993 వ సంవత్సరం).
1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్‌ అఫ్‌ నార్త్‌ అమెరికా వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల (గోల్డెన్‌ జూబ్లీ సెలేబ్రషన్‌) సేవకు గాను ఘన సన్మానం.
బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ నంది అవార్డు.
2001 జూన్‌ 9వ సంవత్సరంలో ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌ వారిచే జీవిత సాఫల్య బహుమతితో సన్మానం.
2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట బహుమతి
అకాడమీ అఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, తిరుపతి వారిచే ప్రెసిడెంట్‌ అఫ్‌ ఇండియా అవార్డు బహూకరణ.
బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), పెళ్లి పుస్తకం (1991), మిస్టర్‌ పెళ్ళాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
2013కుగానూ ప్రకటించిన పద్మ పురస్కారాలలో కళల విభాగంలో తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ బహుమతి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.